9010892345 Whatsup moviepromotion.pro@gmail.com
Select Page

తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో భరత్ కోమలపాటి(సన్నీ కోమలపాటి) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం S5 No Exit. శౌరీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై
ఆదూరి ప్రతాప్ రెడ్డి, దేవు శామ్యూల్, షైక్ రెహీమ్, మెల్కి రెడ్డి గాదె,
గౌతమ్ కొండెపూడి నిర్మించారు. హర్రర్ థ్రిల్లర్ కి… కాస్త పొలిటికల్ డ్రామాను జోడించి తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే విడుదలయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం అలరించిందో చూద్దాం పదండి.

సినిమా కథ: ప్రజాసేవ పార్టీ ముఖ్యమంత్రి(సాయి కుమార్) తనయడు సుబ్బు(తారకరత్న) తన పుట్టిన రోజు వేడుకలను హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లే ట్రైన్ లోని ఎస్5 బోగీలో జరుపుకోవాలని తండ్రి ప్లాన్ చేస్తారు. దాంతో సుబ్బు తన మిత్రులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలను ఎస్5 బోగీలో జరుపుకుంటూ… వైజాగ్ వెళుతుంటే మధ్యలో సన్నీ(ప్రిన్స్) తన డ్యాన్స్ బృందంతో కలిసి అదే బోగీలో అనుకోకుండా ఎక్కుతాడు. అక్కడ సుబ్బు, సన్నీ బ్యాచ్ కి ఒకరంటే ఒకరు గిట్టకుండా… అస్తమాను తగువులాడుతూ ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ఉన్నట్టుండి ఆ కోచ్ లో ఒక్కొక్కరూ మాయం అవుతూ… ఆ కోచ్ తలుపులు తెరుచుకోకుండా సుబ్బు అండ్ సన్నీ బ్యాచ్ ని ఏదో ఒక తెలియని భూతం హింసిస్తూ ఉంటుంది. ఒక్కొక్కరుగా మాయమవుతూ ఉంటే… చివరకు సుబ్బు అతని స్నేహితుడు సంజయ్ తో కలిసి ట్రై నుంచి దూకేసి ప్రాణాలు కాపాడుకుంటారు. మరి ఇలా ప్రాణాలు కాపాడుకున్న వీళ్లని ఎస్5 కోచ్ లో ఎవరు ఇబ్బంది పెట్టారు? ఎందుకు వాళ్లని హింసించారు? చనిపోయిన వాళ్లంతా ఏమయ్యారు? ఆ కోచ్ లో వున్న దెయ్యం ఎవరు? చివరకు ఎలాంటి నిజాలు బయటకు వచ్చాయి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ… కథనం విశ్లేషణ: తారకరత్న ఇటీవల కాస్త వైవిధ్యం ఉన్న పాత్రలను ఎంచుకుని సినిమాలు చేస్తున్నారు. గతంలో కూడా అమరావతి లాంటి సినిమాలో విలనిజం వున్న పాత్రను చేసి మెప్పించారు. ఇటీవల వెబ్ సిరీస్ లో కూడా ఓ డిఫరెంట్ రోల్ పోషించి మెప్పించాడు. ఇందులో కూడా తారకరత్న చాలా డిఫరెంట్ గా ఉంటుంది. తన లుక్ కూడా ఇంతకు ముందుకంటే చాలా స్టైలిష్ గా వుంది. దర్శకుడు తన తొలి సినిమాకి ఓ వైవిధ్యమైన కథను ఎంచుకుని స్క్రీన్ పై ఆవిష్కరించారు. హారర్ థ్రిల్లర్ కి… కాస్త పొలిటికల్ డ్రామను కూడా జోడించడం ఆసక్తి కలిగిస్తుంది. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే ట్రైన్ లో ఒక కోచ్ మొత్తం మంటలు అంటుకోవడం… అందులో ఉన్న వాళ్లంతా చనిపోయారనుకుంటే… తిరిగి బతికి రావడం… ఆ ఒక్క బోగికే ఎందుకు మంటలు వ్యాపిస్తాయి? సీఎం తనయుడు సుబ్బు తన మిత్రులతో కలిసి బోగిని అలంకరించుకుని పార్టీ చేసుకుంటూ వుంటే… సడెన్ గా కోచ్ డోర్స్ క్లోజ్ కావడం… ఆ తర్వాత అగ్నిప్రమాదం జరగడం… అసలా అగ్నిప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఆ తర్వాత ఏమైందనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. చివరిదాకా ఊహకందని ట్విస్టులతో సినిమా ఆద్యంతం ఉత్కంఠను రేపుతుంది.

తండ్రి చెప్పిన మాట ప్రకారం నడుచుకునే సుబ్బు పాత్రలో తారకరత్న బాగా నటించారు. మాటలు కూడా చాలా తక్కువగా వుంటాయి. కేవలం హావ భావాలతోనే ఆకట్టుకున్నారు. నాన్న చెప్పిందే చేస్తా నాకేం తెలియదు అన్నట్టు ఉండే సుబ్బు… చివరకు ఎలాంటి డెసిషన్ తీసుకుకుంటారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. టీసీ పాత్రలో అలీ చేసే కామెడీ అందరినీ ఆకట్టుకుంటుంది. బిగ్ బాస్ కాన్సెప్ట్ డైలాగులు బాగా కనెక్ట్ అవుతాయి. దుబాయ్ నుంచి వచ్చే సులేమాన్ పాత్రలో సునీల్ కాసేపు కనిపించి బాగా నవ్విస్తాడు. ఇస్మార్ట్ శంకర్ లోని పాటలకు డ్యాన్స్ చేస్తూ… తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. దొంగల బ్యాచ్ కి లీడర్ వహించే పాత్రలో ప్రిన్స్ బాగా సూట్ అయ్యారు. గబ్బర్ సింగ్ బ్యాచ్, ఫిష్ వెంకట్, రఘు తదితరులు అంతా తమ కామెడీ ట్రాక్ లతో అలరించారు.

ఇండస్ట్రీలో హీరో అవుదామని వచ్చి… చివరకు కొరియోగ్రాఫర్ గా మారి.. ఇప్పుడు దర్శకుడి అవతారం ఎత్తిన దర్శకుడు భరత్ కోమలపాటి… ఈ చిత్రానికి కాస్త వైవిద్యంగా వున్న కథను రాసుకుని… దాన్ని సెల్యులాయిడ్ పై ఓ వైపు భయపెడుతూనే… మరో వైపు వినోదాత్మకంగా ఆవిష్కరించారు. హారర్ థ్రిల్లర్ కి పొలిటికల్ డ్రామాను జోడించి… చాలా ఆసక్తికరంగా సినిమాని తెరకెక్కించారు. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్… ఇలాంటి హారర్ సినిమాలకు పర్ ఫెక్ట్ యాప్ట్ అయింది. గరుడవేగ అంజి అందించిన సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ కూడా చాలా గ్రిప్పింగ్ గా వుంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా… కంటెంట్ ను నమ్ముకుని సినిమా తీశారు. చాలా రిచ్ గా వున్నాయి నిర్మాణ విలువలు. గో అండ్ వాచ్ ఇట్.

మూవీ ప్రమోషన్ రేటింగ్ : 3/5